Saturday, July 27, 2013

June 2013 Current Affairs in Telugu

జూన్ - 2013 వార్తల్లో వ్యక్తులు



 జూన్ 1
¤ సైప్రస్, లిబియా, సూడాన్ వంటి దేశాల్లో ఏడాది పాటు ఐక్యరాజ్య సమితి ఆధ్వర్యంలోని శాంతి పరిరక్షణ దళంలో విధులు నిర్వర్తించడానికి మన రాష్ట్రం నుంచి తొమ్మిది మంది పోలీసు సిబ్బంది ఎంపికయ్యారు.     » వీరిలో హైదరాబాద్ నగరానికి చెందిన ఉత్తర మండలం డీసీపీ సిహెచ్.శ్రీకాంత్, బేగం బజార్ ఇన్‌స్పెక్టర్ కె.ఎం.కిరణ్‌కుమార్, సిటీ స్పెషల్ బ్రాంచ్ ఇన్‌స్పెక్టర్ జి.లక్ష్మీమాధవిలతో పాటు మంచిర్యాల డీఎస్పీ ఎం.రమణకుమార్, బెల్లంపల్లి ఆర్డ్మ్ రిజర్వ్ డీఎస్పీ పి.ఎస్.ఆర్.మూర్తి, సీఐడీ ఇన్‌స్పెక్టర్ జె.రమేష్ ఇంటలిజెన్స్ సెక్యూరిటీ వింగ్ ఆర్.ఐ.సాయిరామ్, బీబీనగర్ ఎస్సై రఘువీరారెడ్డి, కౌంటర్ ఇంటలిజెన్స్ సెల్ (తిరుపతి) హెడ్ కానిస్టేబుల్ గౌస్‌బాషా ఉన్నారు.      » దేశంలో మొత్తం మీద 195 మంది పోలీసులు ఎంపికవగా, వారిలో మనరాష్ట్రం నుంచి తొమ్మిది మంది ఉన్నారు. వీరంతా ఏడాది పాటు ఆయా దేశాల్లో విధులు నిర్వహిస్తారు.
¤ ఇన్ఫోసిస్‌కు కొత్త ఛైర్మన్‌గా ఆ సంస్థ మాజీ ఛైర్మన్ సహ వ్యవస్థాపకుడు ఎన్.ఆర్.నారాయణమూర్తిని నియమిస్తూ కంపెనీ డైరెక్టర్ల బోర్డు బెంగళూరులో నిర్ణయం తీసుకుంది.
      » జూన్ 1 నుంచి అయిదేళ్ల కాలానికి ఆయనను నియమించింది.
     
ఎన్.ఆర్.నారాయణమూర్తి
      » మూర్తి కోసం కంపెనీ ఎగ్జిక్యూటివ్ ఛైర్మన్ పదవీ విరమణ వయోపరిమితిని ఇప్పుడున్న 60 ఏళ్ల నుంచి 75 ఏళ్లకు పెంచుతూ ఇన్ఫోసిస్ నిర్ణయం తీసుకుంది.      » ఏడేళ్ల క్రితం ఇన్ఫోసిస్ ప్రధాన బాధ్యతల నుంచి తప్పుకున్న నారాయణమూర్తి 66 ఏళ్ల వయసులో తన కలల సౌధానికి మరోసారి జవసత్వాలు అందించడానికి ముందుకొచ్చారు.      » భారత దేశానికి ఐటీ అంటే ఏమిటో తెలియని రోజుల్లో ఇన్ఫోసిస్ సంస్థను 1981లో స్థాపించిన నారాయణమూర్తి ఆ సంస్థను ప్రపంచ స్థాయి కంపెనీగా మలిచారు.      » దేశంలో రెండో అతిపెద్ద సాఫ్ట్‌వేర్ సేవల కంపెనీ ఇన్ఫోసిస్‌లో క్లయింట్లు తగ్గిపోవడం, మార్కెట్ వాటా క్షీణిస్తూ ఉండటం, సిబ్బంది వలసలు పెచ్చుమీరడం, లాభాలు దిగజారడం, ఆధిపత్యం తగ్గుతూ ఉండటం వంటి ప్రతికూల పరిస్థితుల నేపథ్యంలో నారాయణమూర్తికి మళ్లీ పగ్గాలు అందించాలని సంస్థ నిర్ణయించింది.      » ప్రస్తుత ఛైర్మన్ కె.వి.కామత్‌కు బదులు మూర్తి పగ్గాలు చేపడతారు.      » కామత్ హాయంలో సంస్థ షేర్ల విలువ 15 శాతం క్షీణించడం గమనార్హం.      » కామత్ ఇకపై ప్రధాన స్వతంత్ర డైరెక్టర్ హోదాలో కొనసాగుతారు.      » ప్రస్తుత కార్యనిర్వాహక సహ ఛైర్మన్‌గా ఉన్న ఎస్.గోపాలకృష్ణన్ (క్రిస్)ను మళ్లీ కార్యనిర్వాహక వైస్‌ఛైర్మన్‌గా మార్చారు.      » మేనేజింగ్ డైరెక్టర్, సీఈవోగా ఉన్న ఎస్.డి.శిబూలాల్ ప్రస్తుత బాధ్యతల్లోనే కొనసాగుతారు.      » మూర్తి నియామకం ఈ నెల 15న జరిగే సంస్థ వార్షిక సాధారణ సమావేశం (ఏజీఎం)లో ఆమోదం అనంతరం అమల్లోకి వస్తుంది.      » ఈ అయిదేళ్లలోనూ మూర్తి ఏడాదికి ఒక్క రూపాయి మాత్రమే జీతంగా తీసుకుంటారు.      » మూర్తి ఇన్ఫోసిస్ సీఈఓగా 19 ఏళ్ల పాటు పనిచేయగా, ఆ కాలంలోనే అమెరికాలోని నాస్‌డాక్‌లో నమోదైన తొలి భారతీయ కంపెనీగా ఇన్ఫోసిస్ చరిత్ర సృష్టించింది. అంతే కాకుండా 7.3 బిలియన్ డాలర్ల (రూ.40,000 కోట్ల) కంపెనీగా ఎదిగింది.      » 1981 నుంచి 2002 వరకు మూర్తి ఇన్ఫోసిస్‌కు సీఈఓగా, 2002-06 మధ్య ఛైర్మన్‌గా ఉన్నారు. 2006-11 మధ్య కాలంలో కార్యనిర్వహణేతర ఛైర్మన్‌గా వ్యవహరించారు. ఆగస్టు 2011లో తన 65వ ఏట పదవీ విరమణ చేశారు.      » తాజాగా మూర్తి పునర్నియామకంతో పాటు ఆయన కుమారుడు, ఇన్ఫోసిస్‌లో తదుపరి తరం ప్రతినిధి రోహన్ మూర్తి కూడా ఇన్ఫోసిస్‌లో చేరడానికి రంగం సిద్ధమైంది. రోహన్ తన తండ్రికి కార్యనిర్వాహక సహాయకుడిగా నియమితుడయ్యారు. 

 జూన్ 2
¤ ఇజ్రాయెల్‌లో ఆస్ట్రేలియా రాయబారిగా భారత సంతతికి చెందిన దేవానంద్ శర్మ నియమితుడయ్యారు.      » ఈ ఘనత సాధించిన అత్యంత పిన్న (37 ఏళ్ల) వయస్కుడిగా శర్మ రికార్డు సృష్టించారు.¤ ఇతర గ్రహాలపై మానవుడి మనుగడ అనే అంశంపై అమెరికాకు చెందిన నేషనల్ ఏరోనాటిక్స్ అండ్ స్పేస్ అడ్మినిస్ట్రేషన్ (నాసా) నిర్వహించిన స్పేస్ సెటిల్‌మెంట్ కాంటెస్ట్-2013లో మన రాష్ట్రానికి చెందిన ట్రిపుల్ ఐటీ విద్యార్థులు రూపొందించిన ప్రాజెక్టులకు బహుమతులు లభించాయి.      » నూజివీడు ట్రిపుల్ ఐటీకి చెందిన బత్తుల లక్ష్మీప్రసన్న రూపొందించిన 'టైటాన్.. ది డ్రీం వరల్డ్' ప్రథమ బహుమతి గెలుచుకుంది.      » ఇదే సంస్థకు చెందిన మత్తి యామినీ ప్రియ, సౌమ్య, సిద్ధార్థ రూపొందించిన గరుడ ప్రాజెక్టు మూడో బహుమతి సాధించింది.      » అమెరికాలోని శాండియాగోలో ఈ పోటీలు నిర్వహించారు.
 జూన్ 3
¤ ఎవరెస్టు శిఖరాన్ని అధిరోహించిన అతిపిన్న వయస్కుడైన భారతీయుడిగా 15 సంవత్సరాల 7 నెలల రాఘవ్ జానేజా రికార్డు సృష్టించాడు.      » న్యూఢిల్లీలోని లారెన్స్ పాఠశాల విద్యార్థి అయిన జానేజా మరో నలుగురు విద్యార్థులతో కలసి ఎవరెస్టును విజయవంతంగా అధిరోహించాడు. ఈ బృందంలో ఇతడే చిన్న వయస్కుడు.      » ఎవరెస్టు శిఖరాన్ని అధిరోహించేందుకు విద్యార్థి పర్వతారోహక బృందాన్ని పంపిన తొలి పాఠశాలగా లారెన్స్ పాఠశాల రికార్డు సృష్టించింది.
 జూన్ 6
¤ అమెరికాకు చెందిన 84 ఏళ్ల గ్లోరియో మెకంజీ అనే వృద్ధురాలు 'పవర్ బాల్' లాటరీలో 590.5 మిలియన్ డాలర్లు (రూ. 3,360 కోట్లు) గెలుచుకుని సంచలనం సృష్టించింది. అమెరికాలో ఒక వ్యక్తి ఇంత మొత్తంలో జాక్‌పాట్ కొట్టడం ఇదే తొలిసారి.
 జూన్ 7
¤ భారతీయ అమెరికన్ వైద్య నిపుణుడు దేవేందర్ భాటియా టెక్సాస్ మెడికల్ బోర్డు సభ్యుడిగా నియమితుడయ్యారు.
      » ఇది అమెరికా వైద్య వ్యవహారాల పర్యవేక్షణ బోర్డుల్లో ప్రముఖమైంది.
      » భాటియా ఈ పదవిలో ఆరేళ్లు ఉంటారు.
¤ హైదరాబాద్ బంజారాహిల్స్‌లోని స్టార్ ఆస్పత్రికి చెందిన సీనియర్ కన్సల్టెంట్ కార్డియోథొరాసిక్ శస్త్ర చికిత్స నిపుణుడు డాక్టర్ సజ్జా లోకేశ్వరరావుకు ప్రతిష్ఠాత్మక 'అమెరికన్ అసోసియేషన్ ఫర్ థొరాసిక్ సర్జరీ' (ఏఏటీఎస్) సభ్యత్వం లభించింది.
      » 1917లో స్థాపించిన ఈ అసోసియేషన్‌లో 35 దేశాల నుంచి దాదాపు 1,200 మంది ప్రముఖ కార్డియోథొరాసిక్ సర్జన్లకు సభ్యత్వం ఉంది. ఈ ఏడాది అత్యంత ప్రతిభ ఉన్న 37 మంది సర్జన్లకు సభ్యత్వం కల్పించారు. అందులో భారత్ నుంచి నలుగురు మాత్రమే ఎంపిక కాగా, మన రాష్ట్రం నుంచి లోకేశ్వరరావుకు మొదటిసారి ఈ అవకాశం దక్కింది.

¤ సంచలన్మాక కేసుల దర్యాప్తునకు చిరునామాగా మారిన సీబీఐ హైదరాబాద్ విభాగం జాయింట్ డైరెక్టర్ (జేడీ) లక్ష్మీనారాయణను విధుల నుంచి రిలీవ్ చేస్తూ సీబీఐ ప్రధాన కార్యాలయం ఉత్తర్వులు జారీ చేసింది.
      » డిప్యుటేషన్‌పై ఏడేళ్లు సొంత రాష్ట్రంలో సేవలు అందించిన ఆయన గడుపు పూర్తయిన నేపథ్యంలో ఆయనను రిలీవ్ చేశారు
.
 
      లక్ష్మీనారాయణ
      » లక్ష్మీనారాయణ స్థానంలో చెన్నై సీబీఐ విభాగానికి జేడీగా వ్యవహరిస్తున్న అరుణాచలానికి బాధ్యతలు అప్పగించారు.
      » కర్నూలు జిల్లాకు చెందిన లక్ష్మీనారాయణ మహారాష్ట్ర క్యాడర్ ఐపీఎస్ అధికారి.

 జూన్ 9
¤ గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్రమోడీని పార్టీ ఎన్నికల ప్రచార కమిటీ సారథిగా భాజపా నియమించింది. ఈ నిర్ణయంతో ఆయన అనధికారికంగా భాజపా ప్రధాని అభ్యర్థి అయిపోయారు.

 జూన్ 12
¤ ఆస్ట్రేలియా స్విమ్మర్ ఖోలెమెక్ కార్డెల్ క్యూబాలోని హవానా నుంచి అమెరికాలోని ఫ్లోరిడాకు 166 కిలోమీటర్ల దూరాన్ని ఈది, ప్రపంచ రికార్డు సృష్టించారు. షార్క్ చేపల నుంచి రక్షణకు సంబంధించి ఎలాంటి పరికరాలను (షార్క్ కేజ్) ఉపయోగించకుండా ఈ ఘనత సాధించిన తొలి మహిళగా ఆమె గుర్తింపు పొందారు.      » ఈ ప్రమాదకర జల మార్గాన్ని 'ఫ్లోరిడా జలసంధిగా పిలుస్తారు.
 జూన్ 14
¤ తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామికి హెచ్‌సీఎల్ అధినేత శివనాడార్ రూ.కోటి విరాళం సమర్పించారు.¤ పాకిస్థాన్‌లోని పంజాబ్ శాసనసభలో సభ్యుడిగా కన్జీరామ్ అనే హిందువుకు అవకాశం లభించింది. పదహరేళ్లలో ఒక హిందువు పాక్‌లో చట్టసభలో ప్రవేశించడం ఇదే తొలిసారి.      » పీఎంఎల్ఎన్ తరఫున రహిమ్ యార్‌ఖాన్ జిల్లా సదిఖాబాద్‌కు చెందిన కన్జీరామ్, నరోవల్‌కు చెందిన సిక్కు ప్రతినిధి సర్దార్ రమేష్‌సింగ్ అరోరాలు నియమితులయ్యారు.      » ఎన్నికల్లో పార్టీలు సాధించిన స్థానాలను బట్టి పంజాబ్ శాసనసభలో ముస్లిమేతరులకు ఎనిమిది స్థానాలను కేటాయించారు. పంజాబ్‌లో పీఎంఎల్ఎన్ అత్యధిక స్థానాలు గెలుచుకున్న నేపథ్యంలో ఏడు సీట్లను ఆ పార్టీకి కేటాయించారు.      » గతంలో 1997లో సేత్ భరత్‌రామ్ అనే హిందువు పాక్ చట్టసభలో ప్రవేశించారు.
 జూన్ 15
¤ ఆంధ్రప్రదేశ్ పారిశ్రామిక, వాణిజ్య మండళ్ల సమాఖ్య (ఫ్యాప్సీ) నూతన అధ్యక్షుడిగా శ్రీనివాస్ అయ్యదేవర ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.      » సీనియర్ ఉపాధ్యక్షుడిగా శివ్‌కుమార్ రుంగ్తా ఎన్నికయ్యారు.      » వీరిద్దరూ ఏడాది కాలం పాటు పదవుల్లో ఉంటారు.

శ్రీనివాస్ అయ్యదేవర
¤ సీబీఐ జేడీగా అరుణాచలం బాధ్యతలు స్వీకరించారు. డిప్యుటేషన్‌పై ఏడేళ్ల పాటు పనిచేసి మహారాష్ట్రకు వెళ్లిపోయిన సీబీఐ జేడీ లక్ష్మి నారాయణ స్థానంలో అరుణాచలం బాధ్యతలు నిర్వర్తించనున్నారు.
      అరుణాచలం
¤ కేంద్ర గృహ నిర్మాణ, పట్టణ పేదరిక నిర్మూలన శాఖ మంత్రి అజయ్ మాకెన్ తన మంత్రి పదవికి రాజీనామా చేశారు.¤ ఐక్య రాజ్య సమితి సాధారణ సభ అధ్యక్షుడిగా జాన్ డబ్ల్యూ ఆషే మూజువాణి ఓటుతో ఎన్నికయ్యారు. వుక్ జెరిమిక్ స్థానంలో ఈ నియామకం జరిగింది.      » ఐరాసలో ఆంటిగ్వా, బార్బుడాస్ శాశ్వత ప్రతినిధిగా ఉన్న జాన్ ఆషే సాధారణ సభ 68వ సమావేశ కాలానికి అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు.
 జూన్ 16
¤ అంతరిక్షంలోకి వెళ్లిన తొలి మహిళా వ్యోమగామిగా వలెంటినా తెరిష్కోవా రికార్డు సృష్టించిన ఘటనకు 50 ఏళ్లు పూర్తయ్యాయి.       » సరిగ్గా 50 ఏళ్ల క్రితం రష్యా మహిళా వ్యోమగామి వలెంటినా తెరిష్కోవా 1963 జూన్ 16న ప్రారంభించిన రోదసీయానం ఎందరెందరికో స్ఫూర్తిగా నిలిచింది.  
 వలెంటినా తెరిష్కోవా
¤ ఎయిర్ ఏషియా ఇండియా బోర్డుకు ప్రధాన సలహాదారుగా పారిశ్రామిక దిగ్గజం రతన్‌టాటా పేరును మలేషియాకు చెందిన ఎయిర్ ఏషియా ప్రకటించింది.       » ఎయిర్ ఏషియా అధిపతి టోనీ ఫెర్నాండెజ్
      రతన్‌టాటా
       » టాటాసన్స్, అరుణ్ భాటియా (టెలెస్ట్రా ట్రేడ్ ప్లేస్)లతో కలిసి 49 : 30 : 21 నిష్పత్తిలో ఎయిర్ ఏషియా ఇండియాను ఫెర్నాండెజ్ ఏర్పాటు చేశారు.
       » ఎయిర్ ఏషియా ఇండియా సీఈవో చాండిళ్య.
 జూన్ 17
¤ ప్రతిపాదిత వస్తు సేవాపన్ను (జీఎస్‌టీ) అమలుపై ఏర్పాటైన రాష్ట్రాల ఆర్థిక మంత్రుల సాధికార కమిటీ ఛైర్మన్ పదవికి భాజపా బీహార్ సీనియర్‌నేత సుశీల్‌కుమార్ మోడీ రాజీనామా చేశారు.       » భాజపా-జనతాదళ్ (యునైటెడ్) తెగతెంపుల నేపథ్యంలో జీఎస్‌టీ సాధికార కమిటీ ఛైర్మన్ పదవికి ఆయన రాజీనామా చేశారు.
¤ ప్రధాని మన్మోహన్ సింగ్ రాజ్యసభ సభ్యుడిగా ప్రమాణ స్వీకారం చేశారు.       » రాజ్యసభ ఛైర్మన్, ఉపరాష్ట్రపతి హమీద్ అన్సారీ ఛాంబర్‌లో జరిగిన ప్రమాణ స్వీకార కార్యక్రమానికి కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీ, రాజ్యసభ డిప్యూటీ ఛైర్మన్ పీజే కురియన్, ఇతర కాంగ్రెస్ నాయకులు హాజరయ్యారు.
     మన్మోహన్ సింగ్
       » ఇటీవలే మన్మోహన్ వరుసగా అయిదోసారి అసోం నుంచి రాజ్యసభకు ఎన్నికయ్యారు.
 జూన్ 18
¤ అమెరికాలో సుప్రీంకోర్టు తర్వాత అత్యంత శక్తిమంతమైన అప్పీళ్ల కోర్టు జడ్జిగా భారతీయ అమెరికన్ శ్రీనివాసన్ (46) ప్రమాణ స్వీకారం చేశారు.       » చండీగఢ్‌లో జన్మించిన ఆయన అమెరికా అప్పీళ్ల కోర్టు న్యాయమూర్తిగా ఇటీవలే ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ ఘనత సాధించిన తొలి భారతీయ అమెరికన్‌గా నిలిచారు.
 జూన్ 20
¤ వాంగ్ యాపింగ్ చైనాకు చెందిన తొలి రోదసీ ఉపాధ్యాయురాలిగా రికార్డు సృష్టించారు.
       » సుమారు 6 కోట్ల మంది చైనా విద్యార్థులు రోదసీ నుంచి వాంగ్ యాపింగ్ చెప్పిన పాఠాన్ని శ్రద్ధగా, ఆసక్తిగా విన్నారు.

       వాంగ్ యాపింగ్
       » వైమానిక దళ పైలట్ అయిన వాంగ్ రోదసీలో 'భారరహిత స్థితి - న్యూటన్ గురుత్వకర్షణ సిద్ధాంతంపై దాని ప్రభావం' అనే అంశంపై సుమారు 45 నిమిషాల పాటు పాఠం చెప్పారు.
       » దాదాపు 330 ప్రాథమిక, మాధ్యమిక పాఠశాలల విద్యార్థులు, ఉపాధ్యాయులతో పాటు లక్షలాది చైనా పౌరులు సంభ్రమాశ్చర్యాలతో ఈ కార్యక్రమ ప్రత్యక్ష ప్రసారాన్ని వీక్షించారు.
 జూన్ 22
¤ 'జేఈఈ అడ్వాన్డ్స్' పరీక్షలో ఉత్తీర్ణత సాధించిన అతి పిన్న వయస్కుడిగా బీహార్‌లోని భోజ్‌పూర్ జిల్లా బఖోరాపూర్ గ్రామానికి చెందిన 13 ఏళ్ల సత్యం కుమార్ గుర్తింపు పొందాడు. ఈ బాలుడు 679వ ర్యాంకు సొంతం చేసుకున్నాడు.
    సత్యం కుమార్
       » సత్యం గత సంవత్సరం 12 ఏళ్ల వయసులోనే సీబీఎస్ఈ ప్రత్యేక అనుమతితో ఐఐటీ పరీక్షకు హాజరై, 8,137 వ ర్యాంకు తెచ్చుకున్నాడు. ఈ ర్యాంకుతో సంతృప్తి చెందని అతడు ఈసారి మళ్లీ పరీక్షలకు హాజరయ్యాడు.
 జూన్ 23
¤ అమెరికాలో సాగుతున్న రహస్య ఫోన్, ఇంటర్నెట్ నిఘా కార్యక్రమాన్ని బయటపెట్టిన ఆ దేశ జాతీయ భద్రతా సంస్థ (ఎన్ఎస్ఏ) మాజీ ఉద్యోగి ఎడ్వర్డ్ స్నోడెన్ హాంకాంగ్ నుంచి రష్యా వెళ్లిపోయారు.       » అంతకుముందు స్నోడెన్ అప్పగింతకు అమెరికా చేసిన విజ్ఞప్తిని హాంకాంగ్ తోసిపుచ్చింది.       » రహస్య నిఘా ప్రాజెక్టు గురించి ప్రపంచానికి బహిర్గతం చేసిన స్నోడెన్ అమెరికా అరెస్టును తప్పించుకోవడానికి నెలరోజులుగా హాంకాంగ్‌లో తలదాచుకున్నాడు. ప్రభుత్వ ఆస్తిని దొంగిలించడం, జాతీయ రక్షణ సమాచారాన్ని అనుమతి లేకుండా చేరవేయడం వంటి అభియోగాలను ఆయనపై అమెరికా నమోదు చేసింది. స్నోడెన్ అరెస్టుకు అమెరికా అందించిన పత్రాలు తమ చట్టాల అవసరాలకు అనుగుణంగా లేవని హాంకాంగ్ అమెరికా విజ్ఞప్తిని తోసిపుచ్చింది.
 జూన్ 24
¤ అమెరికాలోని తూర్పు అరిజోనా రాష్ట్రంలో భారీ పర్వతాల సముదాయమైన గ్రాండ్ కెన్యాన్ సమీపంలో భూమికి 1500 అడుగుల ఎత్తులో ఎటువంటి రక్షణ ఉపకరణాలు లేకుండా నడిచి నిక్ వలెడా అనే వ్యక్తి రికార్డు సృష్టించాడు. ఈ సాహసం చేసిన తొలి వ్యక్తిగా రికార్డు సాధించాడు.
 జూన్ 26
¤ ఫోర్బ్స్ మ్యాగజీన్ విడుదల చేసిన ప్రతిభా వంతులైన 100 మంది సెలబ్రిటీల జాబితాలో టీవీ వ్యాఖ్యాత ఓఫ్రా విన్‌ఫ్రే తొలిస్థానంలో నిలిచారు. దీంతో ఆమె అయిదుసార్లు ఫోర్బ్స్ జాబితాలో తొలిస్థానం సాధించినట్లయింది.
       » ఓఫ్రా తర్వాతి స్థానాల్లో పాప్ గాయని లేడీ గాగా, దర్శక నిర్మాత స్టీవెన్ స్పీల్‌బర్గ్, గాయకులు బేయోన్స్, మడొన్నా ఉన్నారు.

     ఓఫ్రా విన్‌ఫ్రే
 జూన్ 27
¤ బ్రిటన్‌కు చెందిన రెండేళ్ల బాలుడు ఆడమ్ కిర్బీ ఐక్యూ (మేథో సామర్థ్యం) పరీక్షలో 141 పాయింట్లు సాధించి, అత్యంత మేథో సంపన్నుల సంఘమైన 'మెన్సా క్లబ్' నుంచి ఆహ్వానం అందుకున్నాడు.       » మెన్సా క్లబ్‌లో సభ్యత్వం పొందిన అతిచిన్న పిల్లాడిగా రికార్డు సృష్టించాడు.       » ఆడమ్ జపనీస్, స్పానిష్, ఫ్రెంచ్ భాషలను సైతం అర్ధం చేసుకోగలడు. 100 పదాలకు అక్షర క్రమాన్ని చెప్పడంతోపాటు రసాయన శాస్త్ర మూలకాల పట్టికనూ అప్పజెప్పగలడు.       » ఐక్యూ పరీక్షలో ఆడమ్ అమెరికా అధ్యక్షుడు ఒబామా, బ్రిటన్ ప్రధాని కామెరూన్‌లనూ వెనక్కు నెట్టేశాడు.
¤ ఆభరణాల వ్యాపార రంగంలో ఉన్న జోయాలుక్కాస్ గ్రూప్ ఛైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ జోయ్ అలుక్కాస్ ను 'యూఏఈ లో అగ్రగామి వంద భారతీయ నాయకుల్లో ఒకరుగా' ఫోర్బ్స్ పత్రికకు చెందిన మధ్యప్రాచ్య సంచిక సత్కరించింది.
  జోయ్ అలుక్కాస్
 జూన్ 29

¤ ప్రతిష్ఠాత్మక గూగూల్ వైజ్ఞానిక ప్రదర్శన-2013 తుది పోటీకి భారత్ నుంచి పంజాబ్‌లోని ఎస్.ఎ.ఎస్. నగర్‌కు చెందిన 15 ఏళ్ల సృష్టి ఆస్థాన ఎంపికైంది.       » మొహాలిలోని మిలీనియం పాఠశాలలో ఈ బాలిక 11వ తరగతి చదువుతోంది.       » 2013 జనవరిలో ప్రారంభమైన ఈ పోటీకి 120 దేశాల నుంచి వేలాదిగా దరఖాస్తులు వచ్చాయి. ఇందులో పాల్గొనేందుకు 13-18 ఏళ్ల వయసు విద్యార్థులు అర్హులు. వారంతా తమ ప్రాజెక్టుల ప్రతిపాదనలు సమర్పించి, ప్రయోగాత్మకంగా ఫలితాలనూ నిరూపించాల్సి ఉంటుంది.       » 'వాతావరణంలో డిటర్జెంట్ల ప్రభావాన్ని తగ్గించే హరిత పరిజ్ఞానం' అనే ప్రాజెక్టుతో సృష్టి తుది పోటీకి ఎంపికైంది. సృష్టితో సహా తుది పోటీకి మొత్తం 15 మంది ఎంపికయ్యారు.       » సెప్టెంబరు 23న వీరికి అమెరికాలోని గూగుల్ సంస్థ ప్రధాన కార్యాలయంలో ఫైనల్స్ నిర్వహిస్తారు.¤ సైన్యంలో పనిచేస్తున్న యువ ఇంటిలిజెన్స్ అధికారి లెఫ్టినెంట్ గానెవే లాల్జీ అరుదైన అవకాశాన్ని పొందారు.       » సెంట్రల్ ఆర్మీ కమాండర్ రాజన్ భక్షీకి వ్యక్తిగత కార్యదర్శి (ఎయిడ్ డీ క్యాంప్స్ - ఏడీసీ)గా ఆమె నియమితులయ్యారు.       » సైన్యంలో అత్యున్నత అధికారికి ఒక మహిళను ఏడీసీగా నియమించడం ఇదే ప్రథమం.       » జులై ఒకటి నుంచి ఆమె బాధ్యతలు స్వీకరించనున్నారు.


జూన్ - 2013 అంతర్జాతీయం


జూన్ 1
¤ పాకిస్థాన్‌లో కొత్త పార్లమెంటు కొలువు తీరింది. పాక్ 66 ఏళ్ల చరిత్రలో తొలిసారిగా ప్రజాస్వామ్యబద్ధంగా అధికారం బదిలీ కానుంది.
             »
 కొత్త ప్రధానిగా బాధ్యతలు స్వీకరించనున్న నవాజ్ షరీఫ్ ఇతర పార్లమెంట్ సభ్యులతో కలిసి ప్రమాణస్వీకారం చేశారు. ఆయన ఈ నెల 5న ప్రధానిగా పదవి చేపట్టనున్నారు.
¤ దేశంలోని బహిరంగ ప్రదేశాల్లో జులై 1 నుంచి పొగతాగడాన్ని నిషేధిస్తూ రష్యా ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.             » బస్సులు, రైళ్లు, ఓడలతో పాటు ప్రయాణ ప్రాంగణాలు, లిఫ్టులు, విద్యాలయాలు, ఆసుపత్రులు, ప్రభుత్వ, ప్రైవేటు కార్యాలయాలు తదితర బహిరంగ ప్రదేశాల్లో ధూమపానాన్ని నిషేధించారు.
¤ అమెరికాలోని ఓక్లహామా నగరంలో టోర్నడోలు బీభత్సం సృష్టించాయి. వీటి ధాటికి సుమారు 10 మంది మరణించారు.             » టోర్నడోల ధాటికి 50 వేలకు పైగా ఇళ్లు, వాణిజ్య సముదాయాలు, దుకాణాలకు విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. 
జూన్ 2
 ¤ ఎలిజబెత్-2 బ్రిటన్ రాణిగా పట్టాభిషిక్తమై 60 ఏళ్లు పూర్త్తెన సందర్భంగా లండన్‌లో ప్రత్యేక వజ్రోత్సవ కార్యక్రమాలను నిర్వహించారు.             » 1953 జూన్ 2 న ఎలిజబెత్-2 అధికారికంగా రాణి అయ్యారు.
జూన్ 3
¤ అంతర్జాతీయ ఆయుధాల వ్యాపార ఒప్పందంపై 62 దేశాలు సంతకాలు చేశాయి. ఏటా 8500 కోట్ల డాలర్ల మేర సాగే సంప్రదాయ ఆయుధ వ్యాపారంలో పారదర్శకతను తీసుకురావడంతోపాటు మానవ హక్కుల పరిరక్షణ కోసం ఈ ఒప్పందాన్ని ఐక్యరాజ్య సమితి ప్రతిపాదించింది.             » దాదాపు దశాబ్దకాలం తర్వాత ఆయుధాలకు సంబంధించి ఇలాంటి ఒప్పందం తెరపైకి రావడం ఇదే మొదటిసారి.¤ ఒప్పందం ముసాయిదాను ఐరాస సర్వప్రతినిధి సభ ఈ ఏడాది ఏప్రిల్‌లో ఆమోదించింది. అప్పట్లో 154 దేశాలు దీనికి అనుకూలంగా ఓటు వేశాయి. సిరియా, ఉత్తర కొరియా, ఇరాన్ వ్యతిరేకంగా ఓటు వేయగా భారత్, రష్యా, చైనా, ఈజిప్ట్ సహా 23 దేశాలు ఓటింగ్‌కు గైర్హాజరయ్యాయి.             » ఒప్పందం అమల్లోకి రావడానికి 50 దేశాలు సంతకాలు చేయాల్సి ఉండగా తాజాగా 62 దేశాలు సంతకాలు చేశాయి.             » ట్యాంకులు, సాయుధ పోరాట వాహనాలు, భారీ క్యాలిబర్ శతఘ్నులు, యుద్ధ విమానాలు, దాడులు జరిపే హెలికాప్టర్లు, యుద్ధ నౌకలు, క్షిపణులు, క్షిపణి లాంఛర్లు, చిన్నపాటి ఆయుధాల వ్యాపారం ఈ ఒప్పందం పరిధిలోకి వస్తాయి.¤ ఐరోపాలోని టర్కీ దేశంలో ప్రధానమంత్రి తయ్యిప్ ఎర్డోగాన్‌కు వ్యతిరేకంగా ఆగ్రహ జ్వాలలు దేశవ్యాప్తంగా వ్యాపించాయి. పోలీసులకు, ప్రజలకు మధ్య అంతర్యుద్ధం తారాస్థాయికి చేరింది.

       టక్సిం స్క్వేర్‌ పార్కు
             » టర్కీలోని ప్రధాన నగరం ఇస్తాంబుల్‌లోని 'టక్సిం స్క్వేర్‌'లో ఉన్న ఒక పార్కు (ఉద్యానవనం)ను తొలగించడానికి ప్రభుత్వం ప్రయత్నిస్తున్న నేపథ్యంలో దేశంలో ప్రజాందోళనలు చెలరేగాయి.             » 'టక్సిం స్క్వేర్' నుంచి నగరానికి కావాల్సిన నీటిని వివిధ మార్గాల్లో పైప్ లైన్ల ద్వారా సరఫరా చేస్తారు. 'టక్సిం' అంటే పంపిణీ అని అర్థం.             » 1923లో టర్కీలో జరిపిన స్వాతంత్య్ర సంగ్రామానికి చిహ్నంగా ఈ స్క్వేర్‌ను 1928లో నిర్మించారు. ఇక్కడే ప్రపంచంలో అతి పురాతన రెండో సొరంగ మార్గం (సబ్‌వే) కూడా ఉంది. నగరంలో యాత్రికులు, పౌరులు అందరూ కలిసే పెద్ద కూడలి. ఇక్కడి ఉద్యానవనంలో ప్రజలు నిత్యం యోగా, సంగీతం, ధ్యానం, నడక ఇతరత్రా సాంస్కృతిక కార్యక్రమాలతో సేదతీరుతుంటారు. అభివృద్ధి పేరుతో అక్కడి పార్కును అధికార ఏకే పార్టీ ప్రభుత్వం కూల్చడానికి ప్రయత్నించడంతో ఆందోళనలు ప్రారంభమయ్యాయి.
జూన్ 4
¤ అణు కార్యక్రమాల్ని వీడాలంటూ ఇరాన్‌పై అమెరికా మరోసారి ఆంక్షలను విధించింది.             » మొత్తం మీద ఒబామా యంత్రాంగం ఇరాన్‌పై ఆంక్షలు విధించడం ఇది తొమ్మిదోసారి.             » అమెరికా ఈసారి ఏకంగా ఇరాన్ కరెన్సీ రియాల్‌నే లక్ష్యంగా చేసుకుంది. రియాల్ కొనుగోలుకు లేదా విక్రయానికి సౌకర్యం కల్పించే విదేశీ ఆర్థిక సంస్థలపై చర్యలుంటాయంటూ అమెరికా అధ్యక్షుడు ఒబామా ఉత్తర్వులు జారీ చేశారు.
జూన్ 5
 ¤ చక్రాలు లేకుండా, ప్రత్యేక అయస్కాంతత్వ ట్రాకుపై గంటకు 500 కి.మీ. వేగంతో దూసుకుపోయే 'ఎల్ఓ' మోడల్ బుల్లెట్ రైలును జపాన్ తొలిసారిగా పరీక్షించింది.
¤ పాకిస్థాన్ ముస్లిం లీగ్-నవాజ్ (పీఎంఎల్-ఎన్) పార్టీ అధినేత నవాజ్ షరీఫ్ పాకిస్థాన్ ప్రధానమంత్రిగా ప్రమాణం చేశారు. ఆయన ప్రధాని పదవి చేపట్టడం ఇది మూడోసారి. ద్వారా షరీఫ్ చరిత్ర సృష్టించారు.

ఆసిఫ్ అలీ జర్దారీ, నవాజ్ షరీఫ్
            » సైనిక కుట్రతో ప్రధాని పదవిని కోల్పోయి, ప్రవాస జీవితం అనుభవించి సుమారు 14 ఏళ్ల అనంతరం ప్రధాని పదవిని చేపట్టడం
             » పాకిస్థాన్ అధ్యక్ష భవనంలో అధ్యక్షుడు ఆసిఫ్ అలీ జర్దారీ షరీఫ్‌తో ప్రధానిగా ప్రమాణం చేయించారు.             » మూడుసార్లు సైనిక కుట్రకు గురైన 66 ఏళ్ల పాకిస్థాన్ చరిత్రలో తాజాగా షరీఫ్ 27వ ప్రధాని అయ్యారు. మూడోసారి ప్రధాని పదవిని చేపట్టిన వ్యక్తిగా కూడా షరీఫ్ చరిత్ర సృష్టించారు. ఆయన 1990-1993, 1997-1999 మధ్య ప్రధానిగా వ్యవహరించారు. మొదటిసారి అవినీతి ఆరోపణలతో పదవిని కోల్పోగా, రెండోసారి అప్పటి పాక్ సైన్యాధ్యక్షుడు పర్వేజ్ ముషారఫ్ సైనిక కుట్రతో అధికారానికి దూరమయ్యారు.             » ప్రధానిగా ప్రమాణ స్వీకారానికి ముందు షరీఫ్ పాక్ ప్రధానిగా లాంఛనంగా ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా జాతీయ అసెంబ్లీలో అవసరమైన దానికంటే ఆయన అధికంగా ఓట్లు సంపాదించారు. పార్లమెంటు దిగువ సభలో జరిగిన ప్రధాని ఎన్నికలో మొత్తం 342 మంది సభ్యుల ఓట్లకు గాను షరీఫ్ 224 ఓట్లు పొందారు. పాకిస్థాన్ పీపుల్స్ పార్టీ (పీపీపీ) తరఫున పోటీచేసిన మఖ్దూం అమిన్ ఫాహిం 42 ఓట్లు సాధించగా, పాకిస్థాన్ తెహ్రీకే ఇన్సాఫ్ (పీటీఐ) పార్టీ అభ్యర్థి జావెద్ హష్మీ 31 ఓట్లు పొందారు.             » దిగువసభ స్పీకర్ అయాజ్ సాదిఖ్.¤ సుదీర్ఘ కాలంగా ప్రపంచ గణిత మేధావులకు ఒక సవాలుగా మిగిలిపోయిన 'బీల్ కంజెక్చర్' చిక్కుముడిని విప్పిన వారికి రూ.5.67 కోట్లు (పది లక్షల డాలర్లు) బహుమతి మొత్తాన్ని అందిస్తామని అమెరికా గణిత శాస్త్ర సొసైటీ (ఏఎంఎస్) ప్రకటించింది.             » ఈ సొమ్మును అమెరికాలోని డల్లాస్‌కు చెందిన బ్యాంకర్, వ్యాపారవేత్త ఆండీ బీల్ సమకూర్చనున్నారు. ఈ బహుమతిని, సమస్యను ఆయన పేరు మీదుగానే 'బీల్‌ప్రైజ్', 'బీల్ కంజెక్చర్' అని పిలుస్తారు.             » 'బీల్ కంజెక్చర్' ఒక సంఖ్యా సిద్ధాంత సమస్య. దీని పరిష్కారం కోసం ఆండీ బీల్ 1997లో తొలిసారిగా లక్ష డాలర్ల బహుమతిని ప్రకటించారు. తాజాగా బహుమతి మొత్తాన్ని పెంచారు. అయితే ఇంతవరకూ ఎవ్వరూ ఈ సమస్యను ఛేదించలేకపోయారు.
జూన్ 7
¤
 అక్రమ వలస దారులకు చట్టబద్ధత కల్పించి, వారిని అమెరికా పౌరులుగా గుర్తిస్తామన్న ఆదేశ అధ్యక్షుడు బరాక్ ఒబామా ఎన్నికల వాగ్దానానికి ఎదురు దెబ్బ తగిలింది.
             » తగిన అధికార పత్రాలు లేకుండా దేశంలోకి వచ్చి దశాబ్దాలుగా అమెరికాలో ఉంటున్న వారికి అమెరికా పౌరసత్వం కల్పించే ఉద్దేశంతో ఒబామా 'డ్రీమ్ యాక్ట్‌'ను తీసుకొస్తామని గత ఏడాది ఎన్నికల సమయంలో హామీ ఇచ్చారు. దీనికి కార్యరూపం ఇచ్చేందుకు 8 మంది సెనెటర్లతో కూడిన బృందం బిల్లును రూపొందించింది.
             » సెనెటర్ జ్యుడిషియరీ కమిటీ గత నెలలో 13-8 ఓట్లతో దీన్ని ఆమోదించింది. తాజాగా రిపబ్లికన్ల ఆధిపత్యం ఉన్న హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్ ఈ బిల్లును తిరస్కరించింది. ఈ ముసాయిదా చట్టాన్ని సభలో 224 మంది సభ్యులు వ్యతిరేకించగా 201 మంది మాత్రమే సమర్థించారు.
జూన్ 8
¤
 పాకిస్థాన్ కొత్త ప్రధాని నవాజ్ షరీఫ్ మంత్రి వర్గాన్ని ఏర్పాటుచేశారు. కీలకమైన విదేశాంగ శాఖను నవాజ్ షరీఫ్ తన వద్దే ఉంచుకున్నారు.
             » మాజీమంత్రి, 84 ఏళ్ల సర్టాజ్ అజీజ్‌ను ప్రధానమంత్రి సలహాదారుగా నియమించారు. ఆయన విదేశీ వ్యవహారాలు, జాతీయ భద్రతపై ప్రధానికి పలు సలహాలు, సూచనలు చేయనున్నారు.
             » అంతర్గత వ్యవహారాల శాఖ మంత్రిగా నిసార్ అలీ, విద్యుత్ శాఖ మంత్రిగా ఖ్వాజా ఆసిఫ్ నియమితులయ్యారు.
ఇతర మంత్రులు - శాఖలు
             » జాహిత్ హమీద్ - న్యాయశాఖ
             » షాహిద్ ఖఖాన్ - పెట్రోలియం, సహజవనరుల శాఖ
             » ఇషాక్ దార్ - ఆర్థిక, రెవెన్యూ శాఖ
             » ఖ్వాజా సాద్ రఫిక్ - రైల్వే శాఖ
             » గులాం ముర్తజా జటోయ్ - పరిశ్రమల శాఖ
             » బిర్జీస్ తాహిర్ - కాశ్మీర్, గిల్గిత్ వ్యవహారాల శాఖ మంత్రి
             » పర్వేజ్ రషీద్ - సమాచార ప్రసార శాఖ మంత్రి
             » కమ్రాన్ మైఖేల్ - నౌకాయాన మంత్రి
             » సదావుద్దీన్ షర్దీ - ప్రవాస పాకిస్థానీయుల మంత్రి
జూన్ 11
¤ ప్రపంచవ్యాప్తంగా సంభవిస్తున్న వాతావరణ మార్పులు, విద్యుత్ కొరతను దృష్టిలో ఉంచుకుని అంతరిక్ష సౌర విద్యుదుత్పత్తి లక్ష్యంగా పరిశోధనల కోసం భారత్, అమెరికాలు సంయుక్తంగా ఒక అంతర్జాతీయ సంస్థను ప్రారంభించాయి.
           » భారత ప్రముఖ శాస్త్రవేత్త, మాజీ రాష్ట్రపతి, అబ్దుల్‌కలాం, అమెరికాకు చెందిన జాతీయ అంతరిక్ష సొసైటీ ఛైర్మన్ మార్క్ హాప్కిన్స్ ఈ సంస్థ రూపకల్పనలో ప్రముఖ పాత్ర పోషించారు.
జూన్ 12
¤ బరాక్ ఒబామా ప్రభుత్వం సంకల్పించిన చారిత్రక 'వలస సంస్కరణల చట్టం' (ఇమ్మిగ్రేషన్ రిఫార్మ్స్ బిల్లు)పై చర్చించడానికి అమెరికా సెనెట్ 84-15 ఓట్ల తేడాతో అంగీకరించింది.
           » ఈ బిల్లు సంతకాలకు నోచుకుని అమల్లోకి వస్తే అమెరికాలోని దాదాపు 1.10 కోట్ల మంది అక్రమ వలసదారులకు ఎంతో ఊరట కలుగుతుంది. వీరికి అమెరికా శాశ్వత పౌరసత్వంతోపాటు చట్టబద్ధత కూడా లభిస్తుంది. వీరిలో 2.60 లక్షలమంది భారతీయులు కూడా ఉన్నారు.
జూన్ 13
¤ ప్రముఖ బైకుల కంపెనీ హార్లీ డేవిడ్‌సన్ తన 110వ వార్షికోత్సవం సందర్భంగా పోప్ ఫ్రాన్సిస్‌కు రెండు మోటార్ సైకిళ్లను విరాళంగా ఇచ్చింది.
¤ 2011లో మొదలైన సిరియా అంతర్యుద్ధంలో ఏప్రిల్ 2013 వరకు 92,901 మంది మరణించినట్లు ఐక్యరాజ్యసమితి మానవ హక్కుల సంఘం హైకమిషనర్ నవనీతం పిళ్త్లె వెల్లడించారు.           » సిరియా అధ్యక్షుడు బషర్ అల్-అసద్‌ను వ్యతిరేకిస్తూ 2011 మార్చిలో శాంతియుత ప్రదర్శనలు మొదలయ్యాయి. కొన్ని నెలల తర్వాత ఇది సాయుధ తిరుగుబాటుగా మారింది.
జూన్ 14
¤ బ్రిటిష్ యువరాజు ప్రిన్స్ విలియమ్స్, అతడి సోదరుడు హ్యారీ ల రక్తంలో భారతీయ మూలాలు స్పష్టంగా ఉన్నాయని ఇంగ్లండ్ జన్యు శాస్త్రవేత్తలు ప్రకటించారు.           » వీరిద్దరి తల్లి ప్రిన్సెస్ డయానా ద్వారా వారికి ఆ వారసత్వం వచ్చిందట. అందాల డయానాకు అయిదు తరాల వెనకటి బామ్మ మన భారతీయురాలేనట.
  ప్రిన్స్ విలియమ్స్
           »
 స్కాట్‌లాండ్‌కు చెందిన థియోడర్ ఫోర్బ్స్ ఈస్ట్ ఇండియా కంపెనీలో పనిచేసేవాడు. గుజరాత్‌లోని సూరత్‌లో ఉండేవాడు. అతడి వద్ద ఎలిజా కెవార్క్ పనిమనిషిగా చేసేది. ఎలిజా కెవార్క్ తండ్రి భారతదేశంలో స్థిరపడ్డ ఆర్మేనియన్ సంతతికి చెందినవాడు. తల్లి భారతీయురాలు. థియోడర్ ఫోర్బ్స్‌కు ఇంటి సహాయకురాలిగా ఉన్న ఎలిజా ఇంటిమనిషిగానే మారింది. ఆ ఇద్దరికీ కేథరిన్ అనే పాప పుట్టింది. తర్వాత ఇద్దరూ విడిపోయారు. ఆరేళ్ల కేథరిన్‌ను ఫోర్బ్స్ బ్రిటన్‌కు పంపించేశాడు. ఆ కేథరినే ఇంగ్లండ్‌లో డయానాకు పూర్వీకురాలు. డయానా కుమారులు విలియం, హ్యారీలు ఆ రక్తమే పంచుకున్నారు.
           » ఇంగ్లండ్‌కు చెందిన 'బ్రిటిష్ డీఎన్ఏ' అనే సంస్థ ఈ పరిశోధన చేసింది. విలియమ్ తల్లి డయానా సోదరీమణులు, వారి బంధువుల లాలాజలం సేకరించి, జన్యు పరిశోధన చేసిందీ సంస్థ. ఎలిజా, కేథరిన్ వారసులలో అరుదైన మైటోకాండ్రియల్ డీఎన్ఏ (ఎంటీ డీఎన్ఏ) ఉందని పసిగట్టింది. ఈ డీఎన్ఏ ఇప్పటి వరకూ ప్రపంచంలో 14 మంది మహిళల్లోనే గుర్తించారు. అందులో 13 మంది భారతీయులు. ఒకామె నేపాలీ. డయానాది భారతీయ వారసత్వం అనడానికి ఇదే ప్రధాన ఆధారం. ఆ విధంగా విలియమ్స్, హ్యారీల్లో భారతీయ మూలాలున్నాయని సంస్థ నిర్ధరించింది.           » బ్రిటిష్ రాణి ఎలిజబెత్ తర్వాత ఆ సింహాసనాన్ని చార్లెస్ అధిరోహిస్తారు. చార్లెస్ తర్వాత ఆ స్థానం విలియమ్స్‌కే వస్తుంది. ఆ రకంగా భవిష్యత్తులో భారతీయ మూలాలున్న వ్యక్తి తొలిసారి బ్రిటిష్ సింహాసనంపై కూర్చుంటాడు.కానీ... ఈ భారతీయ వారసత్వం అక్కడితోనే ఆగిపోతుంది! ఎందుకంటే ఎంటీ డీఎన్ఏ కేవలం తల్లి నుంచి పిల్లలకే అందుతుంది. తండ్రి నుంచి తర్వాత తరాలకు వెళ్లదు.¤ అశాంతితో అట్టుడుకుతున్న సిరియాలో ప్రభుత్వం రసాయనిక ఆయుధాలను ప్రయోగించిందని అమెరికా ఆరోపించింది. తాము సిరియా తిరుగుబాటు దారులకు ప్రత్యక్షంగా సైనిక మద్దతును అందజేస్తామని తొలిసారి ప్రకటించింది.           » అయితే సిరియాలో రసాయనిక ఆయుధాల ప్రయోగంపై అమెరికా అందించిన సమాచారం నమ్మకం కలిగించేదిగా లేదని రష్యా పేర్కొంది. సద్దాం హుస్సేన్ జన హనన ఆయుధాలు పోగేశారంటూ తప్పుడు ఆరోపణలతో ఇరాక్‌లోకి చొచ్చుకెళ్లినట్లుగా మరోసారి అలాంటి పొరపాటు చేయొద్దని అమెరికాను హెచ్చరించింది.           » సిరియాలో తిరుగుబాటు దారులకు అమెరికా సైనిక మద్దతు ఇస్తే తాము అధునాతన ఎస్-300 క్షిపణులను సిరియా ప్రభుత్వానికి సరఫరా చేసే అవకాశముందని రష్యా హెచ్చరించింది.¤ ఎయిర్ బస్ సంస్థ రూపొందించిన కొత్త తరం విమానం ఏ 350 ని ఫ్రాన్స్‌లోని టౌలోజ్ నగరంలోని విమానాశ్రయం నుంచి ప్రయోగాత్మకంగా పరీక్షించారు.           » సుదీర్ఘ ప్రయాణాల విమాన శ్రేణి మార్కెట్లో బోయింగ్ సంస్థకు చెందిన 787 డ్రీమ్‌లైనర్‌కు పోటీగా ఏ 350 ని ఎయిర్‌బస్ రూపొందించింది.
జూన్ 15
¤ మితవాద మత పెద్ద, ఇరాన్ తరఫున అణు చర్చల్లో ప్రధాన పాత్ర పోషించిన హసన్ రూహానీ ఇరాన్ నూతన అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు.           » దాదాపు 51 శాతం ఓట్లతో అధ్యక్ష ఎన్నికల్లో రూహానీ స్పష్టమైన ఆధిక్యం సాధించారు.

 హసన్ రూహానీ
           »
 అధ్యక్ష అభ్యర్థుల్లో టెహ్రాన్ మేయర్ మొహమ్మద్ బఖర్ 15.76 శాతం ఓట్లతో రెండో స్థానంలో నిలిచారు. మూడు, నాలుగు స్థానాల్లో వరుసగా అణు చర్చల ప్రస్తుత ప్రతినిధి సయీద్ జలీల్, రెవల్యూషనరీ గార్డ్స్ మాజీ కమాండర్ మొహ్‌సేన్ రెజాయ్ ఉన్నారు.
           » ఇరాన్‌లో మొత్తం 5.05 కోట్ల మంది ఓటర్లు ఉండగా, పోలింగ్ 72.7 శాతంగా నమోదైంది.           » రూహానీ వయసు 64 సంవత్సరాలు. స్కాట్లాండ్‌లోని గ్లాస్గో కాలెడోనియన్ విశ్వవిద్యాలయం నుంచి న్యాయ శాస్త్రంలో డాక్టరేట్ అందుకున్నారు.           » అమెరికాతో నిరంతరం తలపడిన అహ్మదీ నెజాద్ స్థానంలో కొత్త అధ్యక్షుడిని ఎన్నుకునేందుకు ఈ ఎన్నికలు నిర్వహించారు. 2005 నుంచి నాలుగేళ్ల చొప్పున వరుసగా రెండు పర్యాయాలు అధ్యక్షుడిగా చేసిందుకు నెజాద్‌కు ఈసారి ఎన్నికల్లో పోటీ చేసేందుకు రాజ్యాంగం ప్రకారం వీలు లేకపోయింది.¤ పాకిస్థాన్ జాతిపిత మహ్మద్ అలీ జిన్నా నివసించిన ఇంటిని ఉగ్రవాదులు ధ్వంసం చేశారు. బలూచిస్థాన్ రాజధాని క్వెట్టాకు 120 కి.మీ. దూరంలోని జియారత్‌లో ఉన్న 121 ఏళ్ల క్రితం నాటి ఈ ఇంటిని బాంబులు పెట్టి పేల్చేశారు. అనంతరం తుపాకులతో పలు రౌండ్లు కాల్పులు జరిపారు.           » ఈ దాడికి తమదే బాధ్యత అని బలూచిస్థాన్ లిబరేషన్ ఆర్మీ ప్రకటించింది.           » 1892లో నిర్మించిన ఈ ఇంటిని బ్రిటిష్ గవర్నర్ జనరల్ ప్రతినిధి వేసవి విడిదిగా వినియోగించేవారు. జిన్నా తన జీవిత చరమాంకంలో క్షయతో బాధపడుతూ ఈ నివాసంలో గడిపారు. స్వాతంత్య్రం అనంతరం పాకిస్థాన్ ప్రభుత్వం ఈ ఇంటిని జాతీయ స్మారకంగా ప్రకటించింది.¤ పాకిస్థాన్‌లోని క్వెట్టాలోని సర్దార్ బహదూర్‌ఖాన్ మహిళా విశ్వ విద్యాలయానికి చెందిన వాహనాన్ని ఉగ్రవాదులు పేల్చివేసిన ఘటనలో 14 మంది విద్యార్థినులు సహా మొత్తం 23 మంది మరణించారు.
¤ సంచలనాలకు మారు పేరైన ఇంటర్నెట్ సెర్చింజిన్ గూగుల్ ఇంటర్నెట్ యాంటెన్నాలను అమర్చిన బెలూన్‌లను ఆకాశంలోకి పంపించి వాటి ద్వారా భూమ్మీద ఏ మారుమూల ప్రాంతానికైనా నెట్ సౌకర్యాన్ని అందుబాటులోకి తెచ్చే ప్రయోగాన్ని ప్రారంభించింది.
           » ఇంటర్నెట్ సౌకర్యం ఖరీదైన వ్యవహారంగా మారిపోయి అనేక పేద దేశాలకు అందని ద్రాక్షగానే ఉంది. ప్రపంచ జనాభాలో 480 కోట్ల మందికి అది దూరంగానే ఉంది.
           »
 ఈ డిజిటల్ అంతరాన్ని తొలగించే లక్ష్యంతో 'ప్రాజెక్ట్ లూన్' పేరుతో బెలూన్ ఇంటర్నెట్ ప్రయోగాన్ని గూగుల్ అత్యంత రహస్యంగా చేపట్టింది.
జూన్ 20
¤ వాస్కోడిగామా భారత పర్యటన వివరాలను పూసగుచ్చినట్లు నమోదు చేసి ఉన్న చేతిరాత ప్రతికి అరుదైన 'యునెస్కో' గౌరవం లభించింది.           » ప్రపంచంలోనే అత్యంత ప్రతిష్ఠాత్మక ప్రమాణపత్రంగా 'యునెస్కో' దీన్ని ప్రశంసించింది.
     వాస్కోడిగామా
           » 15వ శతాబ్దంలో వాస్కోడిగామా భారత యాత్ర సందర్భంగా ఆయన వెంటనే ఉన్న ఒక వ్యక్తి దీన్ని రాసినట్లు చెబుతున్నారు.
జూన్ 21
¤ మాలే అంతర్జాతీయ విమానాశ్రయ నిర్మాణం - నిర్వహణ ఒప్పందాన్ని తప్పు పద్ధతిలో రద్దు చేసినందుకు 1.4 బిలియన్ డాలర్ల (రూ.8,400 కోట్ల) పరిహారం చెల్లించాలని మాల్దీవుల ప్రభుత్వాన్ని జీఎంఆర్ కోరింది.           » సింగపూర్‌లోని అంతర్జాతీయ మధ్యవర్తిత్వ న్యాయస్థానంలో ఈ మేరకు క్లెయిమ్ దాఖలు చేసింది.           » ఇబ్రహీం నషీద్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ నవీకరణ, నిర్వహణ బాధ్యతలను 500 మిలియన్ డాలర్లకు జీఎంఆర్ సంస్థకు అప్పగిస్తూ 2010లో ఒప్పందం కుదిరింది. అప్పట్లో మాల్దీవుల ప్రభుత్వ సారథిగా మహ్మద్ నషీద్ ఉన్నారు. ప్రస్తుత మాల్దీవుల ప్రభుత్వం గతేడాది నవంబరు 27న ఒప్పందాన్ని ఏకపక్షంగా రద్దుచేయడంతో జీఎంఆర్ తాజాగా పరిహారాన్ని కోరింది.
జూన్ 23
¤ ఉత్తర పాకిస్థాన్‌లో విదేశీ పర్యటకులు ఎక్కువగా వచ్చే గిల్గిట్-బల్తిస్థాన్ ప్రావిన్సులో పారా మిలటరీ పోలీసుల వేషంలో ఉన్న తాలిబన్ ఉగ్రవాదులు బునేర్ లోయలోని డయామర్‌లో పర్వతారోహకుల బేస్ క్యాంప్‌లోకి చొరబడి, తొమ్మిది మంది విదేశీ యాత్రికులను, ఇద్దరు పాకిస్థానీలను చంపేశారు.
జూన్ 24
¤ అధికార దుర్వినియోగానికి పాల్పడి, బాలికతో లైంగిక చర్యలు జరిపారన్న కేసులో ఇటలీ మాజీ ప్రధాని బెర్లుస్కోనీ (76)కి రోమ్‌లోని కోర్టు ఏడేళ్ల జైలు శిక్ష విధించింది.
            బెర్లుస్కోనీ
           » 2010లో బెర్లుస్కోనీపై లైంగిక ఆరోపణలు వచ్చాయి. అతడు అధికార దుర్వినియోగానికి పాల్పడి, 17 ఏళ్ల బాలికతో పలుమార్లు లైంగిక చర్య జరిపినట్లు కేసు నమోదైంది.
జూన్ 25
¤ అరబ్ దేశం ఖతార్ రాజు షేక్ హమద్ బిన్ ఖలీఫా అల్‌ధాని అధికార పగ్గాలను కుమారుడు షేక్ తమీమ్‌కు అప్పగించారు.¤ సౌదీ అరేబియా ప్రభుత్వం అక్కడి వారాంతాన్ని గురు, శుక్ర వారాలకు బదులుగా శుక్ర, శనివారాలకు మార్చింది. ఈ మార్పు ఈ నెల 29 నుంచి అమల్లోకి రానుంది.
జూన్ 26
¤ వాషింగ్టన్‌లోని కేపిటల్ హిల్‌లో అమెరికా దిగువ సభ ఆర్థిక సేవల సభాసంఘం సమావేశాన్ని నిర్వహించారు.           » ఈ సమావేశంలో అమెరికాకు 16 లక్షల 96 వేల కోట్ల (16,960,782,994,118.37) డాలర్ల రుణ భారం ఉన్నట్లు వెల్లడించారు.¤ ఆస్ట్రేలియాలో లేబర్ పార్టీ నాయకుడు కెవిన్ రడ్ మళ్లీ ప్రధాని బాధ్యతలు చేపట్టేందుకు ఎన్నికయ్యారు.           » పాలక లేబర్ పార్టీ సారథ్యానికి సంబంధించి మెల్‌బోర్న్‌లో పార్టీలో జరిగిన అంతర్గత ఓటింగ్‌లో దేశ తొలి, ప్రస్తుత మహిళా ప్రధాని అయిన జూలియా గిలార్డ్‌ను ఆయన ఓడించారు.           » పార్టీ శాసనకర్తలు పాల్గొన్న ఈ ఓటింగ్‌లో కెవిన్‌కు 57 ఓట్లు రాగా, గిలార్డ్‌కు 45 ఓట్లు వచ్చాయి. ఈ గెలుపుతో ఆయన ప్రధాని పదవి చేపట్టడానికి రంగం సిద్ధమైంది.           » మూడేళ్ల క్రితం ఇదే విధంగా కెవిన్ నుంచి గిలార్డ్ ప్రధాని పదవిని చేజిక్కించుకున్నారు.           » ఆస్ట్రేలియా గవర్నర్ జనరల్ క్వెంటిన్ బ్రిస్.           » గిలార్డ్ ప్రధానిగా ఉన్నప్పుడు ఖరారైన షెడ్యూలు ప్రకారం ఆస్ట్రేలియాలో సెప్టెంబరు 14న సార్వత్రిక ఎన్నికలు జరగాల్సి ఉంది.           » ప్రధానిని మార్చినప్పటికీ, ఎన్నికలు ఎప్పుడొచ్చినా లేబర్ పార్టీ ఓటమి ఖాయమని సర్వేలు చెబుతున్నాయి. గిలార్డ్‌తో పోలిస్తే కెవిన్‌కున్న ప్రజాదరణ దృష్ట్యా, లేబర్ పార్టీ ఓటమి తీవత్ర కొంత మేర తగ్గొచ్చని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
జూన్ 27
¤ ఆస్ట్రేలియా ప్రధానమంత్రిగా కెవిన్ రడ్ ప్రమాణ స్వీకారం చేశారు.
        కెవిన్ రడ్
¤ హాలీవుడ్ నటి ఎలిజబెత్ టేలర్ తన తొలి వివాహానికి ధరించిన గౌను వేలంలో రూ.1.12 కోట్లు పలికింది.           » లేత గోధుమ రంగుతో, ముత్యాలతో పొదిగి, ఎంతో ఆకర్షణీయంగా ఉండే ఈ గౌనును న్యూయార్క్‌లో క్రిస్టీస్ సంస్థ వేలం వేసింది.           » 79 ఏళ్ల వయసులో 2011లో టేలర్ మరణించారు.
   ఎలిజబెత్ టేలర్ గౌను
జూన్ 28
¤ వలసల సంస్కరణ బిల్లును అమెరికా ఎగువసభ సెనేట్ ఆమోదించింది. దీంతో సరైన ధ్రువీకరణ పత్రాలు లేకుండా అక్రమంగా దేశంలో ఉంటున్న కోటీ పది లక్షల మందికి అమెరికన్ పౌరసత్వం లభించనుంది. అందులో 2.4 లక్షల మంది భారతీయులే.           » ఈ బిల్లు విషయంలో ప్రధాన పార్టీలు రెండూ ఏకాభిప్రాయంతో ఉండటంతో భారీ తేడా (68-32)తో నెగ్గింది.           » దిగువసభ, ప్రతినిధుల సభ ఆమోదం తర్వాత అధ్యక్షుడి సంతకం కోసం వెళుతుంది.¤ తల్లిదండ్రుల ద్వారా పిల్లలకు జన్యుపరమైన వ్యాధులు సంక్రమించకుండా 'రెండో తల్లి' నుంచి డీఎన్ఏను తీసుకునే వివాదాస్పద వైద్య ప్రక్రియకు బ్రిటన్ ప్రభుత్వం పచ్చజెండా ఊపింది.           » 'ఇన్‌విట్రో ఫర్టిలైజేషన్' అనే ఈ చికిత్సకు సంబంధించిన ముసాయిదాను త్వరలో తయారు చేస్తామని బ్రిటన్ ప్రభుత్వ ఆరోగ్యశాఖ ప్రకటించింది.           » ఈ ముసాయిదాకు పార్లమెంటు ఆమోదం లభిస్తే 2015 నాటికి ప్రపంచంలోనే తొలిసారిగా 'ముగ్గురు తల్లిదండ్రుల పిల్లలకు' బ్రిటన్ వేదికవుతుంది.           » ప్రస్తుతం ఆ దేశంలో ఏటా పదిమంది వరకూ చిన్నారులు ప్రమాదకరమైన వారసత్వ జబ్బులవల్ల కళ్లు తెరిచీ తెరవకముందే మరణిస్తున్నారు. దీనికి ప్రధాన కారణం తల్లి అండంలో ఉండే మైటోకాండ్రియల్ డీఎన్ఏ లోపాలు. ఇన్‌విట్రో ఫర్టిలైజేషన్ ప్రక్రియలో తల్లి అండంలోని సమస్యాత్మక మైటోకాండ్రియల్ డీఎన్ఏను తొలగించి దాని స్థానంలో మరో మహిళ అండానికి చెందిన ఆరోగ్యవంతమైన డీఎన్ఏ ను ప్రవేశపెడతారు.
జూన్ 30
¤ పాకిస్థాన్‌లో వేర్వేరు చోట్ల జరిగిన బాంబు దాడుల్లో 43 మంది మృతి చెందారు.           » వాయవ్య పాకిస్థాన్‌లోని పెషావర్‌లో సైనిక బలగాల వాహనశ్రేణి లక్ష్యంగా జరిగిన బాంబు దాడిలో 17 మంది చనిపోయారు.           » క్వెట్టా ప్రాంతంలోని మసీదుకు సమీపంలో రెండు బాంబులు పేలిన ఘటనల్లో 19 మంది మరణించారు.           » దక్షిణ వజీరిస్థాన్‌లో జరిగిన రాకెట్ దాడిలో ఏడుగురు మరణించారు.



జూన్ - 2013 అవార్డులు



 జూన్ 3
¤ రాష్ట్రానికి చెందిన డాక్టర్ ముజీబ్ అధర్‌కు ఆసియా పసిఫిక్ అంతర్జాతీయ పురస్కారం లభించింది. గ్లోబల్ ఎచీవర్స్ ఫౌండేషన్ సంస్థ ఈ పురస్కారాన్ని ముజీబ్‌కు ప్రదానం చేసింది.      » కోళ్లకు సోకే వ్యాధులపై ముజీబ్ అనేక పరిశోధనలు చేశారు.
 జూన్ 4
¤ ప్రముఖ పర్యావరణవేత్త 'సులభ్ ప్రాజెక్టు' వ్యవస్థాపకుడు బిందేశ్వర్ పాఠక్‌కు ఫ్రెంచ్ ప్రభుత్వం 'లెజెండ్ ఆఫ్ ప్లానెట్' అవార్డును అందజేసింది.
      » ఫ్రెంచి సెనేట్ ఉపాధ్యక్షురాలు చంటల్ జోర్డాన్ పారిస్‌లో పాఠక్‌కు ఈ అవార్డును ప్రదానం చేశారు.
 
      » భారత్‌లో పారిశుద్ధ్యం, ప్రజారోగ్యం పెంపుదలకు పాఠక్ విశేషంగా కృషి చేశారు.      » 'సులభ్ కాంప్లెక్స్' పేరుతో దేశంలో మరుగుదొడ్ల విప్లవానికి బిందేశ్వర్ పాఠక్ నాంది పలికారు.
 జూన్ 10
¤ హైదరాబాద్‌లోని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీ (ఐఐసీటీ)లోని బయాలజీ డివిజన్ అధిపతి, శాస్త్రవేత్త డాక్టర్ యు.ఎస్.ఎన్.మూర్తికి ప్రతిష్ఠాత్మక ఐసీఎంఆర్ అవార్డు లభించింది.
      » కీటకాల ద్వారా వ్యాపించే వ్యాధులపై ఆయన చేసిన పరిశోధనలకు ఈ అవార్డు లభించింది
.
      » ఈ అవార్డు విలువ రూ.20,000.
 
యు.ఎస్.ఎన్.మూర్తి
 జూన్ 11
¤ జపాన్‌కు చెందిన ఆర్థిక సేవల సంస్థ 'నోమురా' మాజీ ఐపీఎస్ అధికారి కిరణ్‌బేడీకి సింగపూర్‌లో 'నోమురా అవార్డును ప్రదానం చేసింది.
      » 'భవిష్యత్తు తరాలకు మెరుగైన సమాజం కోసం' అనే ఆశయంతో నెలకొల్పిన ఈ అవార్డును మానవతా కార్యకలాపాల్లో చేస్తున్న కృషికి గుర్తింపుగా కిరణ్‌బేడీకి ప్రదానం చేశారు.

       కిరణ్‌బేడీ
 జూన్ 21
¤ దేశ విద్యుత్తు రంగంలో ఉత్తమ సామర్థ్యం కనబరిచినందుకు ఏపీజెన్‌కోకు పవర్‌లైన్-2013 అవార్డు లభించింది. కేంద్ర విద్యుత్ శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా చేతుల మీదుగా పవర్‌లైన్-2013 అవార్డును జెన్‌కో ఎండీ కె.విజయానంద్ ఢిల్లీలో స్వీకరించారు.
 జూన్ 23
¤ మానవహక్కుల పరిరక్షణలో చేస్తున్న కృషికి ప్రధాని మన్మోహన్‌సింగ్ కుమార్తె అమృత్‌సింగ్‌కు 'ఇండియా అబ్రాడ్ పబ్లిషర్స్ స్పెషల్ అవార్డ్ ఫర్ ఎక్స్‌లెన్స్ 2012' పురస్కారాన్ని న్యూయార్క్‌లో 'ఇండియా అబ్రాడ్' సంస్థ ప్రదానం చేసింది.
      » తమ వృత్తిలో విశేషకృషి చేసిన భారత అమెరికన్ నిపుణులకు ఈ పురస్కారాలను అందజేస్తారు.
         అమృత్‌సింగ్‌
      » 43 ఏళ్ల అమృత్‌సింగ్ న్యూయార్క్‌లోని 'ఓపెన్ సొసైటీ జస్టిస్ ఇనిషియేటివ్' అనే సంస్థలో సీనియర్ న్యాయాధికారిగా పనిచేస్తున్నారు.      » 'అల్‌ఖైదా పై పోరు' పేరుతో అనుమానిత ఉగ్రవాదులపై అమెరికా నిఘా సంస్థ సీఐఏ వేధింపులను తాను రాసిన వ్యాసంలో ఆమె ప్రస్తావించారు. ఈ వ్యాసం అంతర్జాతీయ మీడియా దృష్టిని ఆకర్షించింది.
 జూన్ 26

¤ సహకార రంగంలో ఉత్తమ పనితీరు కనబర్చిన ఆంధ్రప్రదేశ్ స్టేట్ కో ఆపరేటివ్ బ్యాంక్ (ఆప్కాబ్) 2013 సంవత్సరానికి జాతీయ స్థాయిలో 'అవార్డ్ ఆఫ్
ఎక్స్‌లెన్స్' అందుకుంది.
      » నేషనల్ కో ఆపరేటివ్ యూనియన్ ఆఫ్ ఇండియా (ఎన్‌సీయూఐ) ఆధ్వర్యంలో ఢిల్లీలో జరిగిన 16వ ఇండియన్ కో ఆపరేటివ్ కాంగ్రెస్ (ఐసీసీ)లో పంజాబ్ గవర్నర్ శివరాజ్ పాటిల్ నుంచి ఆప్కాబ్ అధ్యక్షుడు కె.వీరారెడ్డి ఈ అవార్డు అందుకున్నారు.

No comments:

Post a Comment

amazon

Sukanya Samriddhi Account - SBI

SUKANYA SAMRIDDHI Account information by SBI SUKANYA SAMRIDDHI ACCOUNT : FACILITY AVAILABLE AT ALL BRANCHES OF SBI Sukanya Samriddhi ...